ముఖ్యమంత్రి యువనేస్తం స్కీం వెబ్‌ పోర్టల్‌ : YuvaNestham.AP.Gov.In

నిరుద్యోగుల దోస్త్‌ ముఖ్యమంత్రి యువనేస్తం స్కీం. ‘యువనేస్తం'తో బహుళ ప్రయోజనం పొందనున్న యువత. యువనేస్తం వెబ్ సైట్ లో నమోదు ఉచితం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న నిరుద్యోగ భృతి పథకం అమలుకు రంగం సిద్ధమైంది. నిరుద్యోగభృతి నిచ్చేందుకు రూపొందించిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం' కోసం ప్రత్యేకంగా వెబ్‌ పోర్టల్‌ను రూపొందించారు. ఈ పోర్టల్‌ కేవలం నిరుద్యోగ అభ్యర్థులు పేర్లను నమోదు చేసుకునేందుకే కాకుండా నిరుద్యోగులకు ఉపాధికల్పన వేదికగా, అటు పరిశ్రమలు/సంస్థలకు ఉద్యోగార్థుల సమాచారాన్నందించేలా, విజ్ఞానాన్ని పంచేదిగా ఉంటుంది. ఐటీతోపాటు ఉన్నత విద్య అవకాశాలనూ పరిచయం చేసే బహుళ ప్రయోజనకారిగా సిద్ధం చేస్తున్నారు. త్వరలో యువనేస్తం మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి రానుంది.

ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌ పోర్టల్‌:
నమోదు ఉచితం.
నిరుద్యోగులకు ఉపాధికల్పన వేదిక.
ఉద్యోగార్థుల సమాచార గడి.
పరిశ్రమలు/సంస్థలకు ఉద్యోగార్థుల సమాచారాన్నందించేలా, విజ్ఞానాన్ని పంచేది.

ఆధార్‌ సంఖ్య నమోదు ద్వారా అర్హుడా? కాదా?:
ఒక అభ్యర్థి యువనేస్తం పోర్టల్‌లో తన ఆధార్‌ కార్డు నెంబరు ఎంటర్‌ చేయగానే ఈ పథకానికి అర్హుడా కాదా? ఒకవేళ అర్హుడు కాకపోతే ఏ కారణంతో అర్హత కోల్పోయారనేదీ స్క్రీన్‌పై 12 రకాల డేటా జాబితాలో టిక్‌, రాంగ్‌ మార్క్‌తో కనిపిస్తుంది. రాంగ్‌ మార్క్‌ చూపిన అంశానికి సంబంధించిన వివరణను కింద వివరంగా వస్తుంది. వీటితోపాటు కొత్తగా నమోదు చేసుకునేవారి సమాచారాన్ని కూడా రియల్‌టైమ్‌లో ఇందులోకి తీసుకువచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

వెబ్ పోర్టల్‌లో వివరాలు...
- ఆధార్‌ డేటా
- ప్రజాసాధికార సర్వే వివరాలు
- రేషన్‌కార్డ్‌ డేటాబేస్‌
- సంక్షేమ పథకాల లబ్ధిదారులు
- అప్రెంటిస్‌షిప్‌ డేటా
- ఈపీఎఫ్‌
- ఈఎస్‌ఐ
- జనాభాలెక్కల వివరాలు
- డిగ్రీ/పాలిటెక్నిక్‌ తదితర విద్యార్హతలు

ఉత్తీర్ణులైన వారి డేటా  సేకరణ:
పట్టభద్రులు/పాలిటెక్నిక్‌ విద్యార్హత ఉన్నవారికి భృతిని చెల్లించనున్న నేపథ్యంలో 2000 సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని అప్పటి నుంచి డిగ్రీ/పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైన వారి డేటాను విశ్వవిద్యాలయాల నుంచి సేకరిస్తున్నారు. ఇందులోభాగంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడి జేఎన్‌టీయూలాంటి విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, తెలంగాణ, ఏపీలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచీ ఈ డేటాను సేకరిస్తున్నారు.
కేంద్ర కార్మికశాఖ సహకారము:
అభ్యర్థుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల వివరాల కోసం కేంద్ర కార్మికశాఖ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 12 లక్షల మంది డేటాను పంపి పరిశీలింపజేసింది. అందులో 2.50లక్షల మందికి ఈపీఎఫ్‌, మరో సమారు లక్ష మందికి ఈఎస్‌ఐ ఖాతాలున్నట్లు(అంటే ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నట్లుగా)కేంద్ర కార్మిక శాఖ ఖరారు చేస్తూ  రాష్ట్రానికి సమాచారం పంపింది. అయితే మున్ముందు కొత్త అభ్యర్థులు నమోదు చేసుకుంటున్నపుడు వారిక్కూడా ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాలున్నాయా అన్న వివరాలను ఆన్‌లైన్‌లో రియల్‌టైమ్‌లో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. అభ్యర్థుల వివరాలను పంపితే నెలలో ఒకసారి వాటిని పరిశీంచి సమాచారం పంపుతామని కేంద్ర కార్మికశాఖ నుంచి సమాచారం వచ్చింది. పోర్టల్‌లో రియల్‌టైమ్‌లోనే ఇవ్వాలంటే హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉందని, అదీగాక గోప్యతకు భంగం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఇవ్వాలంటే ఐటీశాఖతో సంప్రదించాలని రాష్ట్రానికి లేఖను పంపింది. సమాచార గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా సాఫ్ట్‌వేర్‌లో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి... కేంద్ర ఐటీశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. దీనిపై ఒకటిరెండ్రోజుల్లోనే సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావంతో రాష్ట్ర అధికారులున్నారు.

మీ సేవలో ఉచితంగా నమోదు
యువనేస్తం పోర్టల్‌లో పేర్లను నమోదు చేయించుకునే వారి వివరాలతోపాటు ధ్రువీకరణ పత్రాలనూ మీ-సేవలో ఉచితంగా అప్‌లోడ్‌ చేయించుకోవచ్చు. నమోదును పూర్తిగా ఉచితంగా చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖ మీ-సేవలకు సర్క్యులర్‌ జారీ చేసింది.

పారిశ్రామిక సమాచారం:
ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, కొత్తగా ఏర్పడిన, ఏర్పాటవుతున్న పరిశ్రమల డేటాను కూడా ఎప్పకప్పుడు పోర్టల్‌లో అప్‌డేట్‌ చేస్తారు. ఆ పరిశ్రమల్లో అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగావకాశాల వివరాలను నిరుద్యోగులు ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

జాతీయ స్థాయి సమాచారం కేంద్రంగా యువనేస్తం వెబ్‌ పోర్టల్‌:
నిరుద్యోగుల సమాచారం, వారు ఏయే విభాగాల్లో నైపుణ్య శిక్షణ పొంది అర్హతలు సాధించారు వంటి వివరాలను విభాగాల వారీగా ఈ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. దేశంలో ఎక్కడైనా సరే పరిశ్రమలు, ఇతర సంస్థలు వారి అవసరాలకు తగిన నైపుణ్యం కలిగిన నిరుద్యోగులను ఈ పోర్టల్‌ నుంచి ఎంపిక చేసుకుని వారికి ఉద్యోగాలిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
mukhyamantri-yuvanestham-scheme-website

Post a Comment

0 Comments

f